Wednesday, February 9, 2011

మొదటి మజిలీ



నా ప్రయాణం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా. రానే వచ్చింది ఆ రోజు. అప్పుడు మా పెదబాబు తమ్ముడు చిట్టి బాబు నన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చారు. హీరొ హోండా వేసుకుని వచ్చారు. ఇక చూడండి నా హడావిడి. రెండు కారణాలు.


1. నేను అంత వరకు సైకల్, బస్, రిక్క్షా ఎక్కాను కానీ పెద్ద బండి చూడడం అదే మొదటి సారి.
2. నేను అంత వరకు మా వూరు దాటి వెళ్ళింది లేదు. ( ఒక సారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అప్పుడు ఏమీ కనిపించలేదు)


బాబు వచ్చాడని అందరు ఆయనకి మర్యాదలు చేస్తుంటే నాకు మాత్రం చాలా అసహనం గా అనిపించింది. ఇంకా ఎంత సేపు ఉండాలా అని. ఆ బండి ఎప్పుడెప్పుడు ఎక్కలా అని తొందర నాది. నా సామాను  కూడా సర్దేసుకున్నాను. అవి ఏంటంటే.... ఒక ఖాకీ సంచీ, దానిలో ఒక ఎర్ర నిక్కరు, ఒక పచ్చ నిక్కరు, తెల్ల చొక్కా, ఒక బుల్లి కంచం, చిన్న చెంబు. ఇది నా సామగ్రి.

           అన్ని సంచీ లో సర్దుకుని వీధి గుమ్మం దగ్గర ఉన్న పెద్ద ఆరుగు ఎక్కి కూర్చున్నాను. ఆ బండి అక్కడే ఉంది మరి...

ఒక గంట సేపటి తర్వాత బాబు వచ్చాడు. సంచీ పడిపోకుండా హ్యాండల్ కి ముడి వేశాను. ఇక పెద్ద బండి ఎక్కననే సంబరం లో బెంగ గింగా అన్ని మర్చిపోయి ఎగిరి బండి ఎక్కాను. అది స్టార్ట్ చేశాక ఎందుకో తగని భయం వేసింది. అంతే. గట్టిగా బాబు పొట్ట వాటెసుకున్నాను. ఆయనకి నొప్పి వచ్చేంత గట్టిగా. వదాలరా బాబు అన్నా వినలేు నేను. పడిపోతే??? నా భయాలు నావి. అసలే చిన్న వాడిని కదా.

         వూరు దాటి వెళ్తుంటే మా లచ్చిమి కోసం చూశాను. కనిపించలేదు. పోనీలే ఇంకో సరస్వతి ఉంటుంది లే అని సరిపెట్టుకున్నాను. ఎప్పుడు వూరు దాటి ఎరగనేమో... ఏది చూసినా వింత గా అనిపించింది. పచ్చని పొలాలు, కాలువలు అబ్బో ఎన్ని వింతలో అనుకున్నాను. సరిగ్గా మధ్యలో ఒక చోట బండి ఆగింది. ఎందుకని అడిగాను. ఆది రేల్‌వే స్టేషన్ గేటూ. అక్కడ ఆగి రైలు వెళ్ళాక వెళ్ళాలి మనం అని చెప్పారు. 

          రైలు అంటే ఏంటో చూద్దాం అనుకుని కళ్ళు రెండు అటే పెట్టి చూశాను. వామ్మో ఆది మా వూరి బస్సు కన్నా ఎన్నో రెట్లు పెద్దది గా ఉంది. ఎంత సేపు చూసిన ఇంకా వస్తూనే ఉంది. కానీ దాని అరుపు మాత్రం మా వొళ్లో పెద్ద గేద అరుపు కన్నా పెద్దగా ఉంది. 


ఆ చల్ల గాలికి ఎప్పుడు నిద్ర పోయానో కానీ ఇంటికి వచ్చాక లేపితే లేచాను. సాయి ని చూడగానే బొళ్ళంత హుషారు వచ్చింది మా ఇద్దరికి. 


                    అలా నేను పుట్టిన వూరు నుంచి మరొక చోటికి వచ్చాను. 

చెప్పలేదు కదూ ఈ వూరు పేరు కాటూరు.

No comments:

Post a Comment