Saturday, February 5, 2011

కొరకంచు - కొరివి

నేను చేసిన వెధవ పనికి మా తాత నన్ను మళ్లీ మా నాన్న దగ్గరికి పంపేసాడు. మా అమ్మ వెళ్లిపోయినాక మూడు సినిమాలు ఆరు పాటలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్న మా నాన్నారిని నా రాక అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటె దానికీ ఒక కారణం ఉంది. నేను ఆకలికి ఆగలేను, నిద్రకు ఉండలేను, పక్క కూడా పొడిగా వదలను. దానికి తోడు నా బుర్రలో మెరిసే మెరుపులు ఒకటి. అందుకే మా నాన్నకి నన్ను చూస్తే టీకాల వాడిని చూసినంత హడల్.


మా ఇంట్లో వసారా ఉంది. వసారా లో ఒక పక్క అక్కినేని వారు మరో పక్క మా నాన్నారూ ఫొటోల రూపం లో దర్శనం ఇస్తారు. నిజం చెప్పొలంటే మా నాన్నది అందమైన ఉంగరాల జుట్టు. మనిషికి గజం ఎత్తున ఉండేది. ఆయన తిన్నా తినకపోయినా కేశాలకు మాంఛి పోషణ చేసేవాడు. అమ్మాకేమో తల్లో పేలు ఉండేవి. నాన్న తల్లోకి దువ్వెన కూడా దిగదు.అమ్మ వెళ్ళిపోయాక ఇక పేల దిగులు లేకుండా జుట్టు పెంచుకుంటున్నాడు నాన్న.

ఆయనకి ప్రపంచం లో రెండు అంటే ఎంతో ఇష్టం. ఒకటి ఉంగరాల జుట్టు, రెండు అక్కినేని సినిమా.


ఒక రోజు నాకు బాగా ఆకలి వేసింది. ఇంటికి వచ్చి గిన్నెలన్ని చూశాను. ఎక్కడా ఆహారం ఉన్నట్టూ లేదు. నాన్నేమో బుల్లబ్బాయి గారి ఇంట్లో పని చేసి అక్కడే సుబ్బరంగా తినేసి వచ్చాడు. వచ్చి హాయిగా గుర్రు పెట్టి నిదరొతున్నాడు. మరొకడు ఉన్నాడన్న ధ్యాసయినా లేదు మరి. తిన్నగా తాత ఇంటికి పరిగెత్తాను. బామ్మ, తాత పక్క వూళ్ళో సంతకి వెళ్లారు. చేసేది లేక మళ్లీ ఇంటికి వచ్చాను.

నాన్నని పట్టుకుని లేపాను. ఆకలి రో అని. లేస్తే గా....గట్టిగా కూదిపాను. ఉహు....చక్కలగిలి పెట్టాను. లాభం లేదు. సినిమాల్లో రాక్షసులు కుంభకర్ణుడుని లేపడానికి ఎన్ని ఉపాయాలు ఉన్నాయో అన్ని వాడాను. మా నాన్న అంతకంటే గొప్పోడని నాకు కూడా అప్పుడే తెలిసింది.కోడి పెంట వాసన కూడా చూపించా. వెధవ ముక్కు; లేపలేదు. చివరాకరి ప్రయత్నం గా కుండలో నీళ్ళు కూడా పోసా మొహం మీద. ఎబ్బే....మళ్లీ నాకు నా ఆలోచన వచ్చింది. హ్హ హ్హా అని ఒక విలనీ నవ్వు నవ్వాను. పాపం వినలేదు మా నాన్న.

చుట్టూ చూశాను. కనిపించలేదు. మా పక్కింటి పొయ్యిలో కోడి ఉడుకుతుంది. దగ్గరికి వెళ్ళాను. మళ్లీ చుట్టూ చూశాను. ఎవరు లేరు. ఒక చిన్న చేటలో కొన్ని ఎర్ర నిప్పులు పోసాను. తిన్నగా నాన్న మంచం దగ్గరికి వెళ్ళాను. ఆయన తల కింద వేడి వేడి నిప్పులు పెట్టాను. ఒక్క అర నిమిషానికి ఆ బొగ్గు నాన్న జుట్టుకి అంటుకుని ఒక రకమైన వాసన వచ్చింది. ఒక్క దెబ్బకి లేచాడు నాన్న. ఏమయిందో అర్ధం కాలేదు కాసేపు. ఆ తర్వాత బుర్ర సుర్రుమని తోక తొక్కిన కోతి లా ఎగిరాడు. కుండలో నీళ్ళు తెచ్చుకుని గుమ్మరించుకున్నాడు. ఎం చేసినా మంట తగ్గలేదేమో పాపం. అలా అలా కాసేపటికి తేరుకున్నాడు.  అప్పుడు సరిగ్గా నడి నెత్తిన చెయ్యి పెట్టి చూసుకున్నాడు. నా బుల్లి చెయ్యి వెడల్పున జుట్టు వూడి చేతిలోకి వచ్చింది. అంతే. బోరుమన్నాడు. తన ఆస్తి అంతాపోయిన అంత గగ్గోలు పెట్టెవాడు కాదేమో. ఇక చిన్న చింతబరికపుచ్చుకుని నా వెంటాపడ్డాడు.


నాలుగు రోజులు మా బామ్మ నన్ను నాన్న కంట పడకుండా దాచేసింది.

బతికుండగానే ఆయనకి కొరివి పెత్తానని తెగ బాధ పడ్డాడట. కొరివి అంటే ఏన్టని అడిగాన్నెను. గోల్ళున అందరు నవ్వారు. నాకేం తెలుసు ఎందుకో.

నన్ను అన్నం పెట్టకుండా మాడిస్తే వూరుకుంటానా మరి....ఆది మొదలు నాన్న నాకు ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేవాడు.

No comments:

Post a Comment