Sunday, February 27, 2011

దులదర్సన్ - 2


అన్నట్టు చెప్పాను కదూ... నా శుక్రవారం అలా అలా మూడు బఠానీలు, ఆరు సెనక్కయల్లా ముగుస్తుంది. ఇక మిగిలింది శనివారం. ముందే చెప్పాను కదా... నేను, సాయి బాబు ఒకే వూళ్ళో వుంటాం అని... ఆ రోజు అటు పరిగెత్తే వాడిని. ఈ లోపు సాయి కి వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఏదైనా బొమ్మలూ, తినేవో తెచ్చేవారు. పేరు కి ఆడించేవాడిని అనే కాని నిజానికి చిన్న పిల్లలకి బొమ్మలతో అన్ని ఆటలు ఏముంటాయి చెప్పండి. ఏదో నా వయసైతే కాస్త అర్ధం అవుతుంది. 


                       పగలంతా అక్కడ ఆడి ఆడి వచ్చేవాడిని. సాయంత్రం ఏదో రెండు చెంబులు నీళ్ళు గుమ్మరించుకుని నా పళ్ళెం మీద దండ యాత్ర చేసేవాడిని.మా లచ్చమ్మ గారేమో ప్యూరు వేజిటేరియను. కక్క, ముక్క ఏమి తగిలేవి కావు. పిల్లాడిని అని నాకు మాత్రం ఒక రెండు రూపాయిలు ఇచ్చి గుడ్లు తెచ్చుకోమనేవారు. అసలే ఆడి, ఆడి ఉంటానేమో ...ఆట్టే నిద్ర పోయేవాడిని.  వచ్చేది ఏ రోజు మరి... ఆదివారం, ఆటలు ఒకదాంతో ఒకటి వుండాలి గా మరి...


                    ఆదివారం ఉదయాన్నే రంగోలి కార్యక్రమం వచ్చేది. వారం మొత్తం ఆ శాంతి స్వరూప్ ని, విజయ దుర్గ ని చూసి చూసి..... ఆ రంగోలి లో హిందీ అమ్మాయిలను చూస్తే కాస్త ఆట విడుపు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్న అనుకుంటున్నారా... ఎం చెయ్యను మరి ? వాళ్ళ మొహాల్లో ఏ ఫీలింగ్సు అర్ధం అయ్యి చచ్చేవి కావు. 


ఈ పిల్లలేమో చక్కగా ఇకిలిన్చుకుంటూ మాటాడేవారు. ఇంకోటి ఏంటంటే.. మన తెలుగు పాటల కన్నా ఇవి ఇంకా రంగులు రంగులు గా ఉండేవి. నాకు భాష అర్ధం కాకపోయినా భావానికి ఎం తక్కువ చెప్పండి...


                 ఇక తొమ్మిది గంటలకి" శ్రీ కృష్ణ" వచ్చేది. అసలే కృష్ణుడు మా కులదైవం ఆయే. అయినా కాకపోయినా టీవీ లో వచ్చే ఏది అయినా చూడకుండా ఎలా వదులుతాను చెప్పండి. ఎవరికోసం వాళ్ళు అంత కష్టపడి చేసేది... చెప్పండి !!!కృష్ణుడు కుడా నాలాగే... ఒక చోట పుట్టాడు, మరొక చోట పెరుగుతాడు. లచ్చమ్మ గారే మా యశోదమ్మ. 


                     శుక్రవారం నాడు చిత్రలహరి కి ఎలాగయితే కుర్రాళ్ళు, పిల్లలు ఎగబడి వచ్చేవాల్లో...ఈ 'శ్రీ కృష్ణ' కోసం బామ్మలు, తాతలు, తాతమ్మలు, ఒక్కరేమిటి.. వూళ్ళో వున్నా ముసలి సరుకంత వచ్చేది. వచ్చి ఊరుకుంటారా. అడ్వర్తిసుమెంట్లు వచ్చినప్పుడల్లా కృష్ణుడి భజనలు అవి చేస్తూ వుండేవాళ్ళు. ఇక అంతా అయ్యాక కృష్ణుడిని పొగుడుతూనో , కంసుడిని తిడుతూనో సర్డుకునేవాళ్ళు. ఇక వాళ్ళు వెళ్ళాక చూడాలి... అంతా కడగడానికి గంట పట్టేది. వాళ్ళు తిన్న చెత్త చెదారం అంతా ఏరడానికి. 


                  ఇక అది అయిన తరువాత మధ్యానం ఎప్పుడు అవుద్డా అని చూసేవాడిని. ఎందుకంటారా ?


మా లచ్చమ్మ గారి తమ్ముడు బుష్షు గారు ఆ రోజు ఇంటికి వచ్చేవారు. ఆయన కోసం కోడి కూరో, మరోటో తెచ్చేవారు. పిల్లోడిని గా... నాక్కూడా కాస్త పెట్టేవారు. అది తిని ఏనుగు తిన్న అనకొండ లా చుట్టుకుని బజ్జునేవాడిని. 



సాయంత్రం ఒక పెద్ద ఘట్టం  వుంది గా మరి. అది తెలుసుకోవాలంటే నేను చెప్పే దాక ఆగాలి మరి. 
                      మళ్ళి వచ్చి చెబుతాను...

Thursday, February 24, 2011

దూలదర్సన్ -1


నేను ఈ ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక్క నాని బాబు కి తప్ప అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆ బాబు ఎక్కడో దూరం గ చదువుకునేవాడు.


ఏమి చదువులో ఎంటో...ఒక్కల్లనీ ఒక్క చోట ఉండనిచ్చి చావవు కదా....


నేను , లచ్చమ్మ గారు అంజయ్య గారి ఇంటి పైన వాటా లో వుండేవాళ్ళం. ఒక రెండు గదులు, బయట పెద్ద ఖాళీ స్థలం. అది సరదాగా స్నేహితులతో కబుర్ల కోసం కట్టించారట. కాబట్టి స్నానాల గదులు ఉండేవి కాదు. అవి కింద ఉండేవి. నాకు పెద్దగా పని ఏమి వుండేది కాదు. ఒక చిన్న సొట్ట తెపాలా లో నీళ్ళు కింద నుంచి పైకి తెచ్చే వాడిని అప్పుడప్పుడు. అంతే...


                    భోజనం టైం కి నా బొజ్జలో చిరు  గంటలు మోగేవి. ఎక్కడ ఏ ఆటల్లో వున్నా పరిగెత్తుకు వచ్చే వాడిని. నాకు కొత్తగా రెండు ఖాకి లాగులు కుట్టించారు. ఒక తెల్ల చొక్కా, ఇంకోటి పసుప్పచ్చది... ఆ రోజుల్లోనే 'అన్నగారు'  party పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అసలే  మా ఇంట్లో అన్నగారి మీద అభిమానం ఎక్కువ. ఎక్కడ చూసినా పసుపే. నాకు ఎందుకో 
ఆ రంగంటే చెప్పలేనంత చిరాకు...యాక్ ! అలా చూస్తారేంటి...



పైగా న స్నేహితులు నన్ను "ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో...సిట్టింగ్ ఆన్ అ బఫ్ఫాల్లో" అని ఏడిపించేవారు. ఎం చెప్పను నా పాట్లు?


           ఆ రోజుల్లో వొళ్ళో టీవీ లు పెద్దగా ఉండేవి కావు. మా కింద అంజయ్య గారి ఇంట్లో కలరు టీవీ వుండేది. ఇక నాకు ఎంత సరదానో చెప్పలేను. పొద్దున్న నిద్ర లేచి నోరు పుక్కిలించి ఊసి, ఏదో తిని, ఒక 5  తపేలాల నీళ్ళు తెచ్చి పైన పోసి....ఇక తుపాకీకి కూడా దొరక్కుండా పరిగెత్తే వాడిని. అప్పట్లో ఈ ఈటివిలు, గేమిని లు పాడు ఉండేవి గాదు. ఒక్కటే టీవీ. 'దూలదర్సన్' ఒక్కటే వచ్చేది.  క్షమించాలి. దీనికి ఇంత కంటే మంచి పేరు తో పిలవడం వేస్టు అని నా ఫీలింగు. 


              ఎంత సేపు చూసిన ఒకరిద్దరు బట్ట తలల వాళ్ళు పాత వార్తలు చదువుతూ వుండేవారు. నాకు మాత్రం చిత్రలహరి చూడడం అంటే సరదా... రంగు రంగుల బట్టలు వేసుకుని ఆడ, మగా భలేగా గంతులు వేసేవాళ్ళు. వాళ్ళ వంతు గంతులు అయ్యాక, గుర్తు పెట్టుకుని నేను కూడా అలాంటివే ఇంటికొచ్చి వేసేవాడిని. అది కూడా మా లచ్చమ్మ గారు చూడకుండా ...లేదంటే, అంట్ల వెధవా... ఇవేం పనులు అని అని నా వీపు మీద ఒక్కటేసేవారు. అదేం సోద్యం... వాళ్ళు వేస్తె చూస్తారా....నేను చేస్తీ చూడరా.... హమ్మా.....




                    శుక్రవారం పుట టీవీ ని బయటా హాల్లో పెట్టేవాళ్ళు. చుట్టూ పక్కల వాళ్ళు వచ్చి చూసేవారు. ఆ రోజు మా మిత్ర బృందం టీవీ చూడాలంటే నేనే దిక్కు మరి. అందుకే నేనంటే మా వాళ్ళలో ఒక  సెపరేటు లెవెలు వుండేది. చిన్న కొట్టు శెట్టి గారి రాణి నాకు జేబు నిండా బఠానీలు పోసేది టీవీ కి తీసుకు వెళ్తే...పెద్ద కొట్టు శెట్టి కొడుకు తక్కువా.... చిన్న బెల్లం ముక్క... ఒక గుప్పెడు సెనక్కాయలు ఇచ్చేవాడు. ఇక మిగిలిన వాళ్ళు ఇంట్లో క్ష్హెసినవి ఎవిన తెచ్చే వాడు. వెల్లందరికి మొదటి వరసలో సీటింగు నేను తప్ప ఎవరిస్తారు అంట ?


                    ఏదేమైనా నాకు కొన్ని గొప్ప వ్యాపార లక్షణాలు ఆ రోజుల్లోనే అబ్బాయి. 

పరివారం


నా తదుపరి కథ లోకి దూకే ముందు మీకు మరి కొంత మందిని పరిచయం చేస్తాను. కాస్కోండి.


1 . లచ్చమ్మ గారు 


2 . పెదబాబు  - బేబమ్మ--> సాయి, చిన్ను


3 . చినబాబు - శాంతమ్మ1 ----> బుజ్జి, గౌతం 


4 . చిట్టి బాబు , శాంతమ్మ2 ---> చిన్ని, ఫణి


5 . అమ్మాయ్, అల్లుడు ---> నాని, బీము


6 . నాని బాబు, విజ్జమ్మ ---> డింపు


ఇది నా పరివారం. నా తర్వాత  జీవితం అంత ఇక్కడే వీళ్ళ మధ్యే గడిచింది. 


బుష్ గారు -- లచ్చమ్మ గారి  తమ్ముడు


పిచ్చి బేబి -- లచ్చమ్మ గారి చిన్నప్పటి  ఫ్రెండు. ( ఏవో కారణాల వలన పిచ్చిది అయి అటు ఇటు తిరిగేది)


అంజయ్య గారు -- లచ్చమ్మ గారి తండ్రి


రాజమ్మ గారు -- లచ్చమ్మ గారి తల్లి


వోరి నాయనో ఎన్ని పేర్లో కదూ.....మొదట్లో ఏమి గుర్తుండేది కాదు నాకు. మా చెడ్డ కష్టం గా వుండేది సుమా...మెల్లగా అలవాటు అయింది. 



పి. ఎస్ : పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో ఆడ పిల్లల్ని ఒక తరం లో ముద్దు గా బేబి అని అనేవాళ్ళు(  అందుకే నా అంతు లేని కథ లో ఎంతో మంది బేబమ్మ లు కనిపించినా మీరు చింతించవద్దు.)


ఈ  తరం లో ట్రెండు మారింది లెండి. 

Friday, February 18, 2011

క్యా స్వాద్ హై


నా రోజులు మెల్లగా అలా అలా నడుస్తూ వున్నాయి. 


                 నేను ఇక్కడ వున్నరోజుల్లో కొన్ని  గమనించా. ఏంటి అంటారా? వినండి.


డబ్బున్న వాళ్ళకి 


1 .  పిల్లలు తక్కువ.
2 . వాళ్ళ పిల్లలకి ఆకలి తక్కువ. 
3 .  చుట్టాలు ఎక్కువ
4 . వాళ్ళు తెచ్చే చాక్లెట్ లు పొడుగెక్కువ.


           సాయి బాబు కి వాళ్ళ మావయ్యలు, బాబాయిలు, మిగలిన బంధు గణం అంతా ఎప్పుడు ఎవోటి తెస్తూ వుండేవారు. మరి వీరు తిన్టేగా! వాళ్ళ అమ్మేమో సాయి ఏమి తినట్లేదని బాధ పడేవారు. అయినా మీరు  చెప్పండి . ఆకలి వేస్తె తినరా ఏంటి ? 


                       ఉదయం లేచినప్పటి నుంచి మొదలయ్యేది యుద్ధం. పాలు తాగించడానికి అబ్బో చాలానే టైం పట్టేది. ఒక్కోసారి విసుగు వచ్చి ఆ గ్లాసు నా చేతికి ఇచ్చి తాగించమని చెప్పి లోనికి వెళ్ళే వారు. ఇక మా ఇద్దరిది సందడే సందడి. ఒక్క దెబ్బ తో పాలు అన్ని నేను గుట్టుక్కున తాగే వాడిని. కాసిని మాత్రం సాయి మూతికి పూసేవాడిని. 


                 ఇది గమనించిన బేబీ అమ్మ గారు వీడు పెడితే పేచి లేకుండా తింటున్నాడని అన్ని నా చేతికి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదేదో ఇద్దరికీ సౌకర్యం గానే వుంది. ఇద్దరం ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాం. ఏదైనా తెచ్చి నా చేతిలో పెట్టగానే సాయి వైపు చూసే వాడిని. వద్దు అన్నాడా సరే సరి. లేదంటే ఓ రెండు సార్లు తింటావా తింటావా అనేవాడిని. వద్దు అనే మాట ఇంకా నోటి నుంచి సాంతం వచ్చే లోపే గుతుక్కుమనిపించేవాడిని. 


                ఈ తతంగం అంతా పాలు, ఉప్మా, పప్పన్నం వరకు బాగానే సాగింది. ఎప్పుడైతే వాళ్ళ మావయ్య కాడ్బరీ చాక్లెట్ తెచ్చాడో అప్పుడు సాయి మారిపోయాడు. ఎంత మారిపోయాడు అంటే... ఆ చాక్లెట్ చేతిలో వున్నప్పుడు నన్ను చూస్తే చాలు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తి అప్పుడు కానీ తినేవాడు కాదు. 


              నేనా చాక్లెట్ రుచి మరిగిన వాడిని. ఆగమంటే ఆగుతానా ...  చూసి చూసి ఒక రోజు సాయి చేతిలో వున్న చాక్లెట్ ని అమాంతం లాగేసుకున్నాను. కుయ్యో మొర్రో మని ఒకటే ఏడుపు. అది చూసిన వాళ్ళ అమ్మ గారు జరిగిన విషయం విని సాయి కి మరొకటి కొనిచ్చారు. నాకు అది కూడా కావాలి మరి. అది కూడా ఎవరు చూడకుండా లాక్కున్నాను. అదేంటి అని అడిగినందుకు సాయి కి ఒక్క మొట్టికాయ వేసాను. హమ్మా.. ఇదేం పని. 


             నచ్చనివన్నీ నాకు , నచ్చినవి మాత్రం తనకా ? అంతే ఒలంపిక్స్ లో మెడaల్ కోసం పరిగెత్తినట్టు ఒక్క అంగ లో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి వచ్చి రాని మాటలతో జరిగినది అంతా వాళ్ళకి చెప్పేసాడు. అప్పటికి కానీ అర్ధం కాలేదు వాళ్ళకి. ఎన్ని పెట్టినా సాయి అంత బక్కగా , నేనేమో బుగ్గలు అవి వచ్చి ఇంత ముద్దుగా ఎందుకున్ననా అని. 


మళ్ళి రాత్రి అంతా అలోచిన్చుకున్నారు. ఎం చెయ్యడమా అని.  ఇక ఇక్కడ వుంటే సాయి కి సరయిన భోజనం అందడం లేదని నన్ను అదే వూళ్ళో వున్న లచ్చమ్మ గారి ఇంటికి పంపించారు. 


               చెప్పలేదు కదూ... సాయి వాళ్ళ నాయనమ్మ గారే ఈ లచ్చమ్మ గారు. 

Thursday, February 10, 2011

డ్డా డ్డా డ్డాడి........................మ్మమ్మ మ్మమ్మి


పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేవరకు సాయి నాతోనే ఆడుకునే వాడు. ఇద్దరం కలిసి తినేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం. 


అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం నత్తి ఉంది. ఎప్పుడు రాదు కానీ, అప్పుడప్పుడు మాటల సందర్భం లో ఒక్కో మాటనీ రెండు మూడు సార్లు అంటూ ఉంటాను. 


సాయి అప్పుడే చిన్న చిన్న మాటలు చెప్పడం నేర్చుకున్నాడు. మొదట్లో అమ్మ, నాన్న, అత్త, తాతా అంటే ఇంట్లో వాళ్ళు అందరు ఎంతో మురుసుకునేవారు. ఆ వయసులో ఎం మాట్లాడినా అంతే మరి. ఎవరు ఎం మాట్లాడితే తిరిగి అదే మాట అనేవాడు. నాకు కామ్రేడ్ గారు అంటే కోపం. ఆది ఎందుకో తర్వాత చెప్తాను మీకు. ఆయన్ని సుబ్బా తాతా అని పిలిపించుకునేవాడు. నేను చివరికి పదే పదే డబ్బా తాతా , డబ్బా తాతా అని నేర్పించేసరికి అదే అలవాటు అయింది. అందరిలో పట్టుకుని అలానే పిలిచే వాడు. మరి నేను నేర్పానంటే తిరుగు లేదు.



అలా అలా చిన్న చిన్న మాటలు నేను అంటూ ఉంటే మళ్లీ తిరిగి అనేవాడు. అప్పట్లో బొళ్ళంత మంది మీద కశి తీర్చుకున్నా లెండి. కొన్నాళ్ళకి సాయి బాబు వల్ల అమ్మని అఅఅమ్మ అనడం మొదలు పెట్టాడు మొదట్లో ఏదో కొత్తగా ఉందే అనుకుని ఇది కూడా ముద్దేలే అని సరిపెట్టుకున్నారు. అప్పటి నుంచి ప్రతి పదాన్ని ఇలాగే ఖూనీ చెయ్యడం మొదలెట్టాడు. రోజు రోజు కి ఇంట్లో వాళ్ళు కొత్త నుంచి ఆశ్చర్యం, ఆశ్చర్యం నుంచి అయోమయం, అయోమయం నుంచి భయపడడం మొదలు పెట్టారు. చక్కగా మాట్లాడే వాడు ఇలా చేస్తున్నదేమిటా అని. 


             ఎటు చూసినా అందరు చదువుకున్న వాళ్లే. ఎవ్వరికీ ఎలాంటి తేడాలు లేవు. మరి సాయి బాబు కి ఇలా అయిందేమిటా అని కంగారు.


           అలా అలా అందరి కళ్ళు నా మీద పడ్డాయి. రోజు మొత్తం లో ఏసు దగ్గరే కదా ఎక్కువ ఉంటున్నాడు అని. ఓ రోజు మా ఆటల్లో వీళ్ళు కూడా కూర్చుని చూశారు. ఎం చేస్తున్నానా అని. అప్పటికీ కానీ అర్ధం కాలేదు సంగతి. సాయి నేను ఎలా మాట్లాడితే అలా నే నత్తి గా మాట్లాడుతున్నాడు. అంతే. ఆపిల్ కాయ నెత్తి మీద పడి ఆ నొప్పికి న్యూటన్ కి ఏదో సిధాంతం గుర్తొచ్చినప్పుడుః కూడా అంత సంబర పడలేదేమో. యూరేకా అని ఎగిరి గంతులు వేశారు.



     ఆ రాత్రికి పెద్ద వాళ్ళు కూర్చుని ఎం చెయ్యటమా అని ఆలోచించారు. నన్ను దగ్గరికి పిలిచి ఎక్కువ మాట్లాడకుండా ఆడుకుంటే రోజుకో చాక్లేట్ ఇస్తానని ఆశ పెట్టారు. 


      ఇదేదో బాగుందే.... మరుసటి రోజు లేవగానే నేనేం చేసానో తెలుసా... మా చుట్టూ పక్కల మాటలు నేర్చుకునే పిల్లలు ఇంకా ఎవరు ఉన్నారా అని ఇన్వెస్టిగేషన్ చెయ్యడం.


Wednesday, February 9, 2011

హాల్లో కామ్రేడ్


ఉదాయన్నే నిద్ర లేచి చూసేసరికి అంతా కొత్త గా అనిపించింది నాకు. మర్చే పోయాను. కొత్త వూరు కదూ......


ఇల్లంతా తిరిగి చూశాను. ఎటు చూసిన ఎరుపు రంగే. "తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలిలెవ్వరు ?" ఏదో వినబడుతూ ఉంది... అంత లో పొడుగ్గా, సన్నగా ఉన్న ఒక ఆకారం నా ముందు ఉంది. కెవ్వుమన్నాను!!! హాల్లో కామ్రేడ్! చుట్టూ చూశాను. ఎవరినా అని. నిన్నే అన్నట్టు నా భుజం మీద చెయ్యి వేసిందా ఆకారం. నా పేరు సుబ్బా రావు. నన్ను అందరు   కామ్రేడ్ సుబ్బారావు అంటారు అని పరిచయం చేసుకున్నారు. తరువాత తెలిసింది ఆయన ఆ ఇంటి ఓనర్ అని. చిన్నప్పటి నుంచి ఉద్యమ కారుడట.ఉద్యమం అంటే ఏంటి? అదుగుదామ్ అనుకున్నాను. మళ్లీ నాకెందుకులే. అసలే చిన్న పిల్లాడినీ అని వూరుకున్నాను. 


                         ఆయన భార్య పేరు అరుణ. ఆవిడ కూడా అంతే నట. అయిన ఇవన్ని నాకు ఎందుకు. హాయిగా నోరు పుక్కిలించి వూసి సాయి బాబు తో పాటు పాలు తాగడానికి తయారు అయ్యాను. ఏరా! పళ్ళు తోముకోవా ? అని పెదబాబు అడిగాడు. లేదన్నాను.  అయినా వాళ్ళ పిచ్చి కానీ మా వూళ్ళో అయితే మేము పెంచే గొర్ర పిల్లలు పళ్ళు తోముకుంటాయ ఏంటి ? అయినా అవి పాలు తాగట్లేదా ? ఆకులు నమాలట్లేదా ? ఇదంతా చెప్పి వీళ్ళకి కూడా కొంచెం జ్ఞానం ఇద్దాం అనుకున్నా కానీ, అప్పటికే ఆకలి. చేసేది లేక వాళ్ళు చూపించినట్టే చేసి పాలు తాగాను.



సాయి బాబు ఎంత సేపు బతిమాలినా పాలు తాగట్లేదు. చూసి చూసి బేబమ్మ గారు ఆ గ్లాసు నా చేతికి ఇచ్చి తాగించమని చెప్పి టిఫిన్ చేయడానికి లోనికి వెళ్లారు. సాయికి ఆ కబుర్లు ఏ కబుర్లు చెప్పా... ఉహు!! తాగట్లేదు. నవ్విద్డామని కుక్క పిల్లలా అరిసాను. నవ్వతూన్నాడు కానీ ఏమీ లాభం లేదు. అటు ఇటు చూశాను. ఎవరు లేరు. ఆ అయినా ఆకలెస్తే ఇంత సేపు ఎవరినా తాగకుండా ఉంటారా ఏంటి ? గుటుక్కున తాగేశాను.  మళ్లీ పెద్ద వాళ్ళకి అనుమానం వస్తుంది ఏమో అని ఒక వేలు గ్లాసులో పెట్టి కొన్ని పాలు తీసి బాబు మూతికి పూసాను. 


                        అంతలో బేబమ్మ వచ్చి గ్లాసులో చూస్తే పాలు అన్ని అయిపోయాయి. నన్ను ఎంత మురుసుకున్నారో... ఒక్క చుక్కా కూడా లేకుండా మొత్తం బాబు తో తాగించానని. హ్హి హ్హి! పాపం వీళ్ళకేం తెలుసు!


అప్పటికీ బొజ్జ నిండింది.

మొదటి మజిలీ



నా ప్రయాణం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా. రానే వచ్చింది ఆ రోజు. అప్పుడు మా పెదబాబు తమ్ముడు చిట్టి బాబు నన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చారు. హీరొ హోండా వేసుకుని వచ్చారు. ఇక చూడండి నా హడావిడి. రెండు కారణాలు.


1. నేను అంత వరకు సైకల్, బస్, రిక్క్షా ఎక్కాను కానీ పెద్ద బండి చూడడం అదే మొదటి సారి.
2. నేను అంత వరకు మా వూరు దాటి వెళ్ళింది లేదు. ( ఒక సారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అప్పుడు ఏమీ కనిపించలేదు)


బాబు వచ్చాడని అందరు ఆయనకి మర్యాదలు చేస్తుంటే నాకు మాత్రం చాలా అసహనం గా అనిపించింది. ఇంకా ఎంత సేపు ఉండాలా అని. ఆ బండి ఎప్పుడెప్పుడు ఎక్కలా అని తొందర నాది. నా సామాను  కూడా సర్దేసుకున్నాను. అవి ఏంటంటే.... ఒక ఖాకీ సంచీ, దానిలో ఒక ఎర్ర నిక్కరు, ఒక పచ్చ నిక్కరు, తెల్ల చొక్కా, ఒక బుల్లి కంచం, చిన్న చెంబు. ఇది నా సామగ్రి.

           అన్ని సంచీ లో సర్దుకుని వీధి గుమ్మం దగ్గర ఉన్న పెద్ద ఆరుగు ఎక్కి కూర్చున్నాను. ఆ బండి అక్కడే ఉంది మరి...

ఒక గంట సేపటి తర్వాత బాబు వచ్చాడు. సంచీ పడిపోకుండా హ్యాండల్ కి ముడి వేశాను. ఇక పెద్ద బండి ఎక్కననే సంబరం లో బెంగ గింగా అన్ని మర్చిపోయి ఎగిరి బండి ఎక్కాను. అది స్టార్ట్ చేశాక ఎందుకో తగని భయం వేసింది. అంతే. గట్టిగా బాబు పొట్ట వాటెసుకున్నాను. ఆయనకి నొప్పి వచ్చేంత గట్టిగా. వదాలరా బాబు అన్నా వినలేు నేను. పడిపోతే??? నా భయాలు నావి. అసలే చిన్న వాడిని కదా.

         వూరు దాటి వెళ్తుంటే మా లచ్చిమి కోసం చూశాను. కనిపించలేదు. పోనీలే ఇంకో సరస్వతి ఉంటుంది లే అని సరిపెట్టుకున్నాను. ఎప్పుడు వూరు దాటి ఎరగనేమో... ఏది చూసినా వింత గా అనిపించింది. పచ్చని పొలాలు, కాలువలు అబ్బో ఎన్ని వింతలో అనుకున్నాను. సరిగ్గా మధ్యలో ఒక చోట బండి ఆగింది. ఎందుకని అడిగాను. ఆది రేల్‌వే స్టేషన్ గేటూ. అక్కడ ఆగి రైలు వెళ్ళాక వెళ్ళాలి మనం అని చెప్పారు. 

          రైలు అంటే ఏంటో చూద్దాం అనుకుని కళ్ళు రెండు అటే పెట్టి చూశాను. వామ్మో ఆది మా వూరి బస్సు కన్నా ఎన్నో రెట్లు పెద్దది గా ఉంది. ఎంత సేపు చూసిన ఇంకా వస్తూనే ఉంది. కానీ దాని అరుపు మాత్రం మా వొళ్లో పెద్ద గేద అరుపు కన్నా పెద్దగా ఉంది. 


ఆ చల్ల గాలికి ఎప్పుడు నిద్ర పోయానో కానీ ఇంటికి వచ్చాక లేపితే లేచాను. సాయి ని చూడగానే బొళ్ళంత హుషారు వచ్చింది మా ఇద్దరికి. 


                    అలా నేను పుట్టిన వూరు నుంచి మరొక చోటికి వచ్చాను. 

చెప్పలేదు కదూ ఈ వూరు పేరు కాటూరు.

బుల్లి నేస్తం




అలా నేను బేబమ్మ దగ్గరే వాళ్ళ అబ్బాయి తో పాటు ఉన్నాను కొన్నాళ్ళు. ఇంతకీ నా కొత్త నేస్తం పేరు చెప్పలేదు కదూ....  సాయి. బేబమ్మ గారి ముద్దుల కొడుకు. నేను అక్కడ చేరేసరికి సాయి కి ఏడాదిన్నర. నాకేమో 7 ఏళ్లు.
చిన్న వాడిని అవ్వడం వలన సాయి నాకు బాగా దగ్గర అయ్యాడు. నేను ఎక్కడుంటె తాను కూడా అక్కడే. నిజం చెప్పొద్దు...  నాకు సాయి నచ్చడానికి మరో కారణం మా లచ్చిమి. సాయి కూడా అచ్చ౦ మా లచ్చిమి లాగే తెల్లగా , బొద్దుగా , అందం గా ఉండేవాడు. నాతో బాగా ఆడేవాడు. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను కూడా బాబు తో సమానంగా చూసేవారు. 

నేను అలా కొన్నాళ్ళు అక్కడ ఎలాంటి పెచీలు పెట్టకుండా ఉన్నాను. దానికి మరో కారణం కూడా ఉంది. నేను పుట్టి బుద్ధి ఎరిగినాక ఎప్పుడు సాయి దగ్గర ఉన్నన్ని బొమ్మలు చూడలేదు. ఎన్ని రకాల బొమ్మలో.....కీ ఇచ్చేవి, ఎగిరేవి, పాకేవి, ఆడేవి, ఒకటేమిటి బోళ్ళన్ని. నాకు మాత్రం పని ఏమీ ఉంది కనుక. చక్కగా తినడం, సాయి బాబు తో ఆడుకోవడం.


అలా ఒక నెల రోజులు ఎలాంటి సాహసాలు లేకుండా చప్పగా గడిపేశాను. నేను ఎప్పుడు అలా ఉంటే ఇన్ని సంఘటనలు జరిగేవా ? ఇక చదవండి...

సాయి బాబు కి కీ ఇస్తే డోలు కొట్టే కోతి బొమ్మ అంటే ఇష్టం. ఆది వాళ్ళ చంటి మావయ్య ఆ రోజు పొద్దునే తెచ్చి ఇచ్చాడు. అదేం చిత్రమో....నాకు కూడా అదే బొమ్మ నచ్చింది. అడిగాను ఇవ్వమని...ఇవ్వలేదు. చూడకుండా దాచేసాను. వాళ్ళ అమ్మని అడిగి తీసుకున్నాడు. ఏంటి చెయ్యడం..? బాబు పాలు తాగక వాళ్ళ అమ్మ లోనికి వెళ్ళింది. చుట్టూ చూస్తే ఎవరు కనిపించలేదు. సాయి దగ్గర బొమ్మ లాక్కున్నాను నేను. అంతే! ప్రపంచం అంతం అయినట్టు ఒక్క సారిగా కేర్ర్ మన్నాడు. నాకు కోపం వచ్చింది. హమ్మా! ఇందాక నేను అడిగితే ఇచ్చాడా మరి.  నాకేం పట్టానట్టు ఒక పక్కన కూర్చుని హాయిగా ఆడుకుంటున్నాను. ఆ అరుపు కి ఒక్క సారిగా ఇంటిల్ల పాది నా ముందు ప్రత్యక్షం అయ్యారు. ఒక పక్క సాయి ఏడుపు, ఇంకో పక్క నా ఆటలు. కానీ చిన్న వాడినని ఏమీ అనలేదు. 

             చివరికి ఒక రోజు బేబమ్మ వాళ్ళు పెదబాబు గారి వూరు ప్రయాణం అయ్యారు. నన్ను అక్కడే ఉంచారు. కొన్నాళ్ళు బాబు ఆడి వెళ్ళిన బొమ్మాలతో ఆడుకున్నాను. నన్ను కూడా వూరు తీసుకువెళ్తాం . అన్ని సర్దుకుని ఉండమని ఒక రోజు ఆ ఇంటికి ఫోన్ వచ్చింది.

Monday, February 7, 2011

మలుపు


నా కథ ఒక దశ దాటి మరొక దశకి మారనుంది. దాని కోసం మీకు కొంత మందిని పరిచయం చేస్తాను.

బుల్లబ్బాయి గారు - మోతుబరి రైతు
లక్ష్మమ్మ - బుల్లబ్బాయి గారి భార్య
బేబమ్మ - బుల్లబ్బాయి గారి కూతురు
పెదబాబు - బుల్లబ్బాయి గారి అల్లుడు

మా తాత లు , వాళ్ళ తాత లు అందరు బుల్లబ్బాయి గారి ఇంట్లో నే  పనులు చేసుకునే వాళ్ళు. మా అమ్మ కూడా అక్కడే పని చేసేది. తాను వెళ్ళిపోయాక కొన్నాళ్ళు నాన్న దగ్గర ఉన్నాను. ఆయనకి కొరివి పెట్టడం తో ఇక నా జోలికి రావాలంటే కూడా భయపడేవాడు.


ఆది ఎంతలా అంటే నేను ఇంట్లో ఉన్నంత వరకు నిద్ర కూడా పోయేవాడు కాదు. అంత హడలగొట్టాను మరి! చూసి చూసి మా నాయనమ్మ తాత తో దెబ్బాలాడి నన్ను మళ్లీ ఇంటికి తీసుకు వెళ్ళింది. అక్కడ మరో సారి విజృంభించాను నేను. ఎలాగంటారా ? చదవండి....


             నాకు చిన్నప్పుడు నుంచీ సైకల్ గాలి కొట్టడం చూడాలంటే మహా సరదా. ఆ శబ్దం బాలెగుంటుంది. అప్పుడప్పుడు మా సందు చివర ఉన్న తాతబ్బాయి సైకల్ కొట్టుకి పోయి విని వచ్చే వాడిని. ఆ క్రమం లో మా తాత కూడా అలాంటి మషీన్ ఏ కొన్నాడు. ఇంట్లో పెట్టి అర్ధ రూపాయి కి రెండు చక్రాలకి గాలి కొట్టేవాడు. ఆది వచ్చిన రోజు నుంచి నాకు, మా బాబాయి పిల్లలకి , మా లచ్చిమి కి సందడే సందడి. దాని చుట్టూ మూగే వాళ్ళం. వాళ్ళు అందరు చూసి వూరుకునేవారు. నేను మాత్రం హ్హ హ్హ హ్హ! మా పక్క ఇంట్లో ఉండే కన్న మావయ్య, రిక్షా తొక్కె బడే తాత, పూజారి రామ శాస్త్రి గారి అబ్బాయి చిన్న సైకీలు దేన్నివదలలేదు. అన్నిటినీ గాలి తీసి వదిలేసే వాడిని. వాళ్ళంతా పొద్దునే మా ఇంటి ముందు బారులు తీరి గాలి కొట్టించుకునే వాళ్ళు. నాకేమో ఆ గాలి సందడి. తాత కేమో రూపాయిల సందడి. మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. పోను పోను రోజు ఇలా జరిగేసరికి అందరిలో అనుమానం. నాకేం తెలుసు కాపలా కాస్తున్నారని. అందుకే అంటుంటారు ఏ విషయాన్ని సాగతీయకూడదు అని. చివరగా మాటు వేసి మరి పట్టేశారు.

                  మా ఇంటికి పంచాయతీకీ వచ్చారు. మా తాత దగ్గర అంతకు ముందు గాలి కొట్టించడానికి ఇచ్చిన డబ్బు మొత్తం తీసేసుకున్నారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఫ్రీ గా గాలి కొట్టేడట్టూ ఒప్పందం చేసుకున్నారు. ఇక నన్నేం చెయ్యాలో అర్ధం కాలేదు తాత కి. తీసుకు వెళ్ళి బుల్లబ్బాయి గారి ఇంట్లో పెట్టారు. పనేమీ లేదు. బేబమ్మ గారి పూజ కి పూలు తెచ్చివ్వడం, ఆవిడ పెట్టె ప్రసాదం తినడం, బుల్ళబాయి గారికి మంచినీళ్ళు తెచివ్వడం వంటి చిన్న చిన్న పనులు.

                                   పెదబాబు గారు పక్క వూళ్ళో  రైస్ మిల్ రన్ చేసే వారు. కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. అప్పటికీ నాకు 8 ఏళ్ళు. వాళ్ల బాబు ని ఆడించడానికి వాళ్ల తో పాటు నన్ను కూడా తీసుకు వెళ్తానన్నారు.

అలా నేను పుట్టిన వూరు నుంచి పక్క వూరు కి ప్రయాణం అయ్యాను.

Saturday, February 5, 2011

కొరకంచు - కొరివి

నేను చేసిన వెధవ పనికి మా తాత నన్ను మళ్లీ మా నాన్న దగ్గరికి పంపేసాడు. మా అమ్మ వెళ్లిపోయినాక మూడు సినిమాలు ఆరు పాటలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్న మా నాన్నారిని నా రాక అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటె దానికీ ఒక కారణం ఉంది. నేను ఆకలికి ఆగలేను, నిద్రకు ఉండలేను, పక్క కూడా పొడిగా వదలను. దానికి తోడు నా బుర్రలో మెరిసే మెరుపులు ఒకటి. అందుకే మా నాన్నకి నన్ను చూస్తే టీకాల వాడిని చూసినంత హడల్.


మా ఇంట్లో వసారా ఉంది. వసారా లో ఒక పక్క అక్కినేని వారు మరో పక్క మా నాన్నారూ ఫొటోల రూపం లో దర్శనం ఇస్తారు. నిజం చెప్పొలంటే మా నాన్నది అందమైన ఉంగరాల జుట్టు. మనిషికి గజం ఎత్తున ఉండేది. ఆయన తిన్నా తినకపోయినా కేశాలకు మాంఛి పోషణ చేసేవాడు. అమ్మాకేమో తల్లో పేలు ఉండేవి. నాన్న తల్లోకి దువ్వెన కూడా దిగదు.అమ్మ వెళ్ళిపోయాక ఇక పేల దిగులు లేకుండా జుట్టు పెంచుకుంటున్నాడు నాన్న.

ఆయనకి ప్రపంచం లో రెండు అంటే ఎంతో ఇష్టం. ఒకటి ఉంగరాల జుట్టు, రెండు అక్కినేని సినిమా.


ఒక రోజు నాకు బాగా ఆకలి వేసింది. ఇంటికి వచ్చి గిన్నెలన్ని చూశాను. ఎక్కడా ఆహారం ఉన్నట్టూ లేదు. నాన్నేమో బుల్లబ్బాయి గారి ఇంట్లో పని చేసి అక్కడే సుబ్బరంగా తినేసి వచ్చాడు. వచ్చి హాయిగా గుర్రు పెట్టి నిదరొతున్నాడు. మరొకడు ఉన్నాడన్న ధ్యాసయినా లేదు మరి. తిన్నగా తాత ఇంటికి పరిగెత్తాను. బామ్మ, తాత పక్క వూళ్ళో సంతకి వెళ్లారు. చేసేది లేక మళ్లీ ఇంటికి వచ్చాను.

నాన్నని పట్టుకుని లేపాను. ఆకలి రో అని. లేస్తే గా....గట్టిగా కూదిపాను. ఉహు....చక్కలగిలి పెట్టాను. లాభం లేదు. సినిమాల్లో రాక్షసులు కుంభకర్ణుడుని లేపడానికి ఎన్ని ఉపాయాలు ఉన్నాయో అన్ని వాడాను. మా నాన్న అంతకంటే గొప్పోడని నాకు కూడా అప్పుడే తెలిసింది.కోడి పెంట వాసన కూడా చూపించా. వెధవ ముక్కు; లేపలేదు. చివరాకరి ప్రయత్నం గా కుండలో నీళ్ళు కూడా పోసా మొహం మీద. ఎబ్బే....మళ్లీ నాకు నా ఆలోచన వచ్చింది. హ్హ హ్హా అని ఒక విలనీ నవ్వు నవ్వాను. పాపం వినలేదు మా నాన్న.

చుట్టూ చూశాను. కనిపించలేదు. మా పక్కింటి పొయ్యిలో కోడి ఉడుకుతుంది. దగ్గరికి వెళ్ళాను. మళ్లీ చుట్టూ చూశాను. ఎవరు లేరు. ఒక చిన్న చేటలో కొన్ని ఎర్ర నిప్పులు పోసాను. తిన్నగా నాన్న మంచం దగ్గరికి వెళ్ళాను. ఆయన తల కింద వేడి వేడి నిప్పులు పెట్టాను. ఒక్క అర నిమిషానికి ఆ బొగ్గు నాన్న జుట్టుకి అంటుకుని ఒక రకమైన వాసన వచ్చింది. ఒక్క దెబ్బకి లేచాడు నాన్న. ఏమయిందో అర్ధం కాలేదు కాసేపు. ఆ తర్వాత బుర్ర సుర్రుమని తోక తొక్కిన కోతి లా ఎగిరాడు. కుండలో నీళ్ళు తెచ్చుకుని గుమ్మరించుకున్నాడు. ఎం చేసినా మంట తగ్గలేదేమో పాపం. అలా అలా కాసేపటికి తేరుకున్నాడు.  అప్పుడు సరిగ్గా నడి నెత్తిన చెయ్యి పెట్టి చూసుకున్నాడు. నా బుల్లి చెయ్యి వెడల్పున జుట్టు వూడి చేతిలోకి వచ్చింది. అంతే. బోరుమన్నాడు. తన ఆస్తి అంతాపోయిన అంత గగ్గోలు పెట్టెవాడు కాదేమో. ఇక చిన్న చింతబరికపుచ్చుకుని నా వెంటాపడ్డాడు.


నాలుగు రోజులు మా బామ్మ నన్ను నాన్న కంట పడకుండా దాచేసింది.

బతికుండగానే ఆయనకి కొరివి పెత్తానని తెగ బాధ పడ్డాడట. కొరివి అంటే ఏన్టని అడిగాన్నెను. గోల్ళున అందరు నవ్వారు. నాకేం తెలుసు ఎందుకో.

నన్ను అన్నం పెట్టకుండా మాడిస్తే వూరుకుంటానా మరి....ఆది మొదలు నాన్న నాకు ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేవాడు.

Friday, February 4, 2011

ఉపాయం లో ఆపాయం.



మా అమ్మ వెళ్లిపోయిన తర్వాత నేను మా నాయనమ్మ తాతయ్య ఇంట్లో పెరిగాను. మా తాత ఆజానుబాహుడు. చాలా బలంగా ఉండేవాడు. మా నాయనమ్మ పొట్టిగా, బక్కగా ఉండేది.


అనగనగా అప్పుడు నాకు 6 ఏళ్ళు. కనీసం ఈ తరం లో అయిన పిల్లల్ని బడికి పంపాలని నిశ్చయం తో మా తాత నాకు పీతల కూర ఎర వేసి మరి బడికి తీసుకుపోయాడు. బళ్ళో మధ్యానం భోజనం , గుడ్డు ఇస్తార్లే అని ఒప్పుకున్నాను. తీరా వెళ్ళాను కదా నాతో అక్షరాల పేరు చెప్పి బొల్లన్ని వంకర్లు తిప్పించాడు మా మాస్టారూ. దానికి తోడు మా తాత ఆదివారం నాడు ఆయనకి మాంఛి మాంసం సమర్పించుకునేవాడు మానవడినీ బాగా పట్టించుకోవాలి అని. ఇక నా పరిస్థితి దారుణం. పక్కనే కూర్చోబెట్టుకుని మరీ దిద్దించేవారు. ఇక ఈ బాధలు తట్టుకోలేక బడికని ఇంట్లో చెప్పి మా పక్కింటి లచ్చిమి తో పాటు బడి పక్కన ఉన్న పశువుల హాస్పిటల్ కి వెళ్ళాము. వాళ్ల నాన్న అక్కడ కొంపౌన్డరు మరి. ఎవరికి కనిపించకుండా దాక్కుని అక్కడికి వచ్చే కుక్కల్ని, కోళ్లని చూస్తూ ఆడుకున్నాం. సరిగ్గా పాసు బెల్లు సమయానికి తాత దగ్గరికి  పరిగెత్తి జేబులో కొన్ని బఠానీలు పోఇంచుకున్నా. బడి వదిలే సమయానికి ఇంటికి పోయి సబ్బరంగా తిని మళ్లీ ఆటలకి వెళ్ళాను.




అలా రెండు రోజులు పోయాక ఆదివారం వచింది. మా మాస్టరు కూడా వచ్చాడు మా తాత దగ్గరికి. అలా నా సంగతి ఇంట్లో తెలిసిపోయింది. అంతా మీ పోలికే అంటూ మా బామ్మ ముసిముసి గా నవ్వింది మా తాత ని చూసి. పోవే ముండా అని కసిరాడు మా తాత. తాత కి దొరకకుండా తిరిగా రెండు రోజులు. నిజం చెప్పొద్దు మా బామ్మ కి కూడా చదువు అంటే నచ్చదు. మా కుల వృత్తి మరిచిపోకుండా గొర్రెలు, ఆవులు కాస్తు వాటి సంతనాన్ని పెంచాలని అంటుండేది.


రెండు రోజులు చూసి మా తాత కి విసుగు వచ్చి ఇక లాభం లేదనుకుని నన్ను గీదలు కాయమని చెప్పాడు. అప్పటికినా బుద్ధి వస్తుందేమో అని ఆశ తో. బుద్ధా ? నాకా ? అని సంతూర్ పిల్లలా అందాం అనుకున్నా కానీ అసలే కాక లో ఉన్నాడు లే అని వదిలేసా. అలా చదివే బాధ నాకు, ప్రతి ఆదివారం ఉచితం గా మాంసం ఇచ్చే బాధ మా తాత కి తీరింది. అలా అలా మా గీదలకె నేను బుల్లి కార్మికుడిని అయ్యాను.




ఇంతకీ మాకు ఎన్ని జీవాలు ఉన్నాయో చెప్పలేదు కదా. ఉన్నది ఒకటే. మా బోడి గీద. దానికి కూడా మా బామ్మ లాగే జుట్టు తక్కువ, హైటు తక్కువ, ఆకలి ఎక్కువ. ఎప్పుడు ఒక చోట మేసేది కాదు. నన్ను కాసేపు కూడా ఎక్కడా ఉండనిచ్చేది కాదు, గోళీలు ఆడానిచ్చేది కాదు. మహా విసుగ్గా ఉండేది నాకు. మా తాత మాత్రం ఏదో చెట్టు నీడన హాయిగా బీడీ కాల్చుకునేవాడు ఆ బోడి దాన్ని నాకు అంటగట్టి.


ఇలా ఉండగా కొన్ని రోజులు మా వూళ్ళో బాగా వర్షాలు పడ్డాయి. దాంతో మా చెరువు పక్క ఉన్న వూబి మళ్లీ నోరు తెరిచిందని చెప్పుకుంటున్నారు. వూబి అంటే ఏంటో నాకు అర్ధం కాలేదు. నా ఫ్రెండ్ తొత్తడమ్ బూశయ్య అని వాడికి మాటలు సరిగ్గా రావు. వాడిని అడిగాను ఏంటిరా అని. వాడు చెప్పాడు, వూబి లో దిగితే ఇక కదలలేము అని. మా బోడి గీద వలన ఏ మధ్య మా లచ్చిమి తో ఆటలు తగ్గాయీ. అప్పుడే మళ్లీ లచ్చిమి నవ్వింది బుర్రలో ఆలోచన మెరిసింది. మర్నాడే మా బోడి గీదని వెంటపెట్టుకుని తిన్నగా వూబి దగ్గరికి వెళ్ళి దాన్ని అక్కడే వదిలేశాను. పెద్ద కొట్లో బఠానీలు తెచ్చుకుందామని వెళ్ళాను కదా మా తాత ఎదురయ్యాడు. నన్ను అక్కడ చూసి పళ్ళు నూరాడు ఈ పని కూడా సరిగ్గా చెయ్యవా అని. అప్పుడే చెప్పాను ఆయనకి నా ఘనకార్యం గురించి. ఆది విని బల్లి మీద పడినట్టు ఉలిక్కిపడ్దాడు. నన్ను ఒంటి చేత్తో లేపి నిజం చెప్పారా తొట్టు కొడకా అని తిట్టాడు. నిజమేనా అన్నాడు! తలూపాను. అంతే! శక్తిమాన్ లా ఒక్క దూకు దూకాడు. మా బామ్మ కి కబురు పెట్టాడు. నేను కూడా అటే పరిగెత్టాను.
వూళ్ళో నలుగురిని పోగేసితీసేకు వెళ్లాడు మా తాత. గంట సేపు కష్టపడి బోడి గేద ని ఇంటికి తీసుకు వచ్చాడు. ఒక్క దెబ్బతో నన్ను మా నాన్న ఇంటికి పంపేసాడు.


ఇక ఆ తర్వాత మళ్లీ నాకు ఏ పని చెప్పలేదు, నా జోలికి రాలేదు.



నామక'రణం'

ముందు టపా లో చెప్పాను కదా. నా పేరు అశోక చక్రవర్తి. 


రణం అని ఎందుకు అన్నానంటే నా పేరు పెట్టడానికి ముందు మా ఇంట్లో పెద్ద గొడవే అయింది. ఇంటికి పెద్ద మానవడినీ, మా నాన్నకి పెద్ద కొడుకుని. అంచేత ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెడదామని అనుకున్నారు. మా తాతేమో సహదేవుడు అని వాళ్ళ నాన్న పేరు, మా నాన్న తన అభిమాన నటుడు అక్కినేని పేరు, మా అమ్మ సొభన్ బాబు పేరు సెలెక్ట్ చేసుకున్నారు. చివరాకరికి మేము పెంచుకునే గొర్రెలు తినే ఆకులనిచ్చే చెట్లు నాటిన అశోకుడి పేరు ఖాయం చేశారు.

అనగనగా ఒక రోజు నేను, నాన్న, చెల్లి ఇంట్లో ఉన్నాం. అమ్మ ర్యాషన్ బియ్యం కోసం కొట్టుకి వెళ్ళింది. నాకేమో చచ్చేంత ఆకలి. మట్టిలో ఆడీ ఆడీ వచ్చాను మరి. నాన్న రేడియో లో అక్కినేని పాటలు వింటున్నాడు. నాదేమో పాట విని పరవశించే వయసు కాదయె. ఆకలి నాన్నో అంటూ వచ్చా. చెల్లి కి జీడి ఇచ్చాను. తీసుకో అన్నాడు. అదేమో అప్పటికే ఆ జీడి మీద పొడి లేకుండా మొత్తం నాకేసింది. కోపం వచ్చి దాని వేలు పట్టుకు కశిక్కున కొరికాను. ఆరున్నొక్క రాగం అందుకుంది మా చెల్లి. పాటకి అంతరాయం కలిగెసరికి ఒక్కటిచాడు నాన్న. ఈ లోపు అమ్మ వచ్చి నా చేతికి చిన్న మసి కుండ ఇచ్చి నీళ్ళు తెమ్మని కుళాయి కి పంపింది. 

నేను తెచ్చే నీటితోనే ఎసరు పొయ్యాలి మరి. ఈ లోపు దారిలో మా గోళీల గ్యాంగు తగిలింది. అసలు విషయం మర్చిపోయి ఆటలో పడ్డాను. అసలే ఆ రోజు ఆట చూడడానికి వచింది ఎవరో కాదు. మా పక్కింట్‌లో ఉండే వెంకట లచ్చిమి. తెల్లగా బొద్దుగా హాఫు లంగా వేసుకుని నోట్లో వేలు పెట్టుకుని భలే ముద్దుగా ఉంటుంది. ఇక రేచిపోయి ఆడాను నేను. అలా నాలుగు ఆటలు అయ్యేసరికి ఆకలి మళ్లీ గుర్తువచింది. దానితో పాటు అమ్మ తెమ్మన్న నీళ్ళ విషయం కూడా. ఆలస్యం చేస్తే అమ్మ ఇచ్చే మొట్టికాయ గుర్తువచ్చింది. ఇక చూడు. ఒక్క పరుగు అందుకున్నాను. తీరా అక్కడ చూస్తే నా వయసు వాళ్ళు అందరు నా లాగే నీళ్ళ కోసం వరసగా నుంచున్నారు. ఎం చెయ్యాలో తోచింది కాదు. లైను లో వెళ్తే మరో గంట పట్టేలా ఉంది. ఎం చెయ్యడం ?

సరిగ్గా అప్పుడే నన్ను చూసి మా లచ్చిమి నవ్వింది. నా బుర్రలో ఒక మెరుపూ మెరిసింది. నా దగ్గరున్న మసి కుండ ని నా నెత్తి మీద బొర్లించుకుని "హీ హా హూ" అంటూ అక్కడ ఉన్న పిల్లల్ని హడాల గొట్టాను. వాళ్ళంతా దెబ్బకు జడుసుకుని పారిపోయారు అక్కడ నుంచి. తీరా కుళాయి దగ్గరకి వెళ్ళి నీళ్ళు కోసం కుండ తియ్యబోతే రాదాయే. అటు తిప్పా ఇటు తిప్పా. అయినా రావట్లేదు. బాబోయ్! కుండ ఇరుక్కుపోయింది. చిన్న ఖాళీ లూ నుంచి గాలి మాత్రం ఆడుతుంది. అప్పటి వరకు అక్కడే ఉన్న లచ్చిమి కూడా నా కొత్త అవతారం చూసి బూచి అంటూ పరుగు అందుకుంది. నాకేమో సరిగ్గా కళ్ళు కనిపించడం లేదు. లోపల మసి కంపు. బొజ్జాలో ఆకలి. అమ్మ గుర్తువచ్చి రాగం అందుకున్నాను. ఎంత సేపటికీ రాకాపోయేతప్పటికీ నన్ను వెతుక్కుంటూ అమ్మ వచ్చింది. నా మసి కుండ మొహాన్ని చూసి "ధబ్" మని కింద పడింది. కొంచెం తీరుకుని వామ్మో అంటూ నా దగ్గరికి వచ్చి ఏమయింది అని అడిగింది. ఆ కంగారు లో ఎప్పుడు నేను చెప్పే అబద్ధం కూడా నన్ను వదిలి పోయింది. గతి లేక నిజం చెప్పేసా. ఆ కోపం ఈ కోపం కలిసి మొట్టికాయ వేసింది. ఆ కుండా కొట్టుకుని పిచ్చ కోపం తో నా నడ్డి మీద నాలుగు వేసింది. 

ఒక పక్క ఆకలి, అమ్మ దెబ్బలు, భయం, ఇవన్ని కలిసి నాకు ఏడుపు వచ్చింది. కళ్ళు ముక్కు రెండు ఏకమయ్యేలా అందుకున్నాను నేను. అప్పటికి అమ్మ శాంతించింది. కుండ కింద నుంచి వచ్చిన నీళ్ళు తుడిచి నన్ను ఎత్తుకోడానికి కిందకి వంగి నన్ను లేపింది. అప్పుడు ఆ కుండ తన గడ్డానికి కొట్టుకుని అమ్మా అని మూలిగింది.సన్నసోడు ఎం చేసినా కంపు పనులే అని తిట్టుకుంటూ బర బరా నా రెక్క పుచ్చుకుని ఇంటికి లాక్కెళ్ళింది. వాకిట్లో నల్లటి ఆకారన్ని చూసి మా చెల్లి పరుగు అందుకుంది. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉంటాయా అనుకుంటూ మా నాన్న కూడా బెంబేలు ఎత్తిపోయాడు. తీరా జరిగింది విని హారీ దేవుడా అని తల పట్టుకుని కూర్చున్నాడు.


సరిగ్గా అదే సమయానికి మా నాయనమ్మ వచ్చి నా పరిస్థితి చూసి కంగారు పడి  డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్దాం అంది. ఏడ్చి ఏడ్చి నాకేమో దాహం, ఆకలి. ఏదైనా పెడదాం అంటే లోపలికి రెండు వెళ్లు కూడా పొవట్లేదు.  చేసేది లేక కింద నుంచి కుండ లోనికి ఫోర్స్ గా నీళ్ళు కొట్టారు. అవి నోట్లోకి పోక పోగా ముక్కులోకి పోయి హాచ్ హాచ్ మని తుమ్మాను.




ఈ లోపు మా నాన్నకి తెలివి వచ్చి మన ప్రయత్నం మనం చేద్దాం అని ఆ కుండని చేత్తో లేపడానికి ప్రయత్నించాడు. ఆది అసలే మసి కుండ. మా తాతల కాలం నుంచి ఇన్తిల్లపాదికి నీళ్ళు కాసిన కుండ మరి. నాన్న చేతులకి మసి అంటింది. నాన్నేమో ఎప్పుడు దసరా బూల్లోడిలా క్రాపు చేరగా నివ్వడు బట్ట నలగనివ్వడు. ఆ మసి అంటే సరికి ఆ కోపం లో కిసుక్కున నవ్విన మా అమ్మని ఒక్కటేశాడు. మరో ప్రయత్నం గా నా మసి కుండ మొహం మీద ఒక తువ్వాలు చుట్టి నా కాళ్ళు రెండు మా అమ్మని గట్టిగా పట్టుకోమని చెప్పి మళ్లీ కుండ లాగే సాహసం చేశాడు. నేనేమో మెడ నొప్పి పుట్టి కుయ్యో మొర్రో మని మూలుగులు. ఈ తంతు లో మా నాన్న తెల్ల బట్టలు కాస్త మసిబారిపోయాయి. ఇక లాభం లేదనుకుని నన్ను తీసుకుని ఓఅక్కా వూరీలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకుపొదామనుకున్నారు.


నన్ను తీసుకుని సెంటర్ కి వచ్చి బస్ కోసం నుంచున్నారు. అక్కడ వాళ్ళంతా ఏదో వింత చూసినట్టు చూడడం పోవడం. పిల్లలేమో ఏడుపు. ఆ రోజుల్లో టీవీ9 వాడు ఆబీన్ వాడు లేరు కానీ, ఉండుంటే మాత్రం మసి కుండని పోలిన వింత ఆకారం పలానా వూరీలో ఉందంటూ మా కుటుంబాన్ని ఒక రోజు హేరోలు చేసేవాళ్ళు. తీరా పావుగంట కి ఒక బస్ వచ్చింది. మా నాయనమ్మ ఎక్కి నన్ను ఎక్కించేంతలో కండక్టర్ వచ్చి ఏంటమ్మా ఏంటి, ఎం ఎక్కిస్తున్నారు బస్ లో అని డబాయించాడు. నన్ను చూసి జడుసుకున్నట్టు ఉన్నాడు పాపం బస్ ఎక్కడానికి వీలు లేదంటే లేదని మమ్మల్ని దింపేసాడు. చేసేది లేక రిక్క్షా మాట్లాడారు. నా నెత్తి మీద ఒక ముసుగు వేసి రిక్క్షా ఎక్కించారు. నాకు ఏమవుతుందో అని బాధ ఒక పక్క , నా మీద కోపం ఒక పక్క. ఉసూరు మంటూ కూర్చున్నారు. అన్నట్టు చెప్పడం మరిచాను. ఇది న తొలి రిక్క్షా ప్రయాణం.


చివరికి డాక్టర్ దగ్గరికి పోయాం కదా, సరిగ్గా అదే సమయానికి డాక్టర్ పని ఉంది పక్క వూరు వెళ్లడట. నా చుట్టూ ఒక 10 మంది గుమిగూడి ఉంటారు అప్పటికే. పాపం తల పగిలింది అని ఒకరు, ఆక్సిడెంట్ అయింది అని ఇంకొకరు ఎవరికి తోచీనట్టు వాళ్ళు అనుకున్నారు. ఆ కొంపౌందేర్ గాడు నన్ను కంసాలి వాడి దగ్గరికి తీసుకుపోయి ఆ మసి కుండ కి ఒక బెజ్జం కొట్టించమని సలహా ఇచ్చడంట. దుర్మార్గుడు. హారీ భగవంతుడా అని బయటికి వచ్చే సమయానికి కొందరు ఏసు ప్రార్థనాలు చేస్తూ కనిపించారట. వాళ్ళు నా మెడకి, కుండకి చుట్టూ ఆముదం రాసి ప్రార్థన చేసి హలెలూయా అని ఒక్క సారిగా ఆ కుండ లాగేసారట. ఇంకెముంది కుండ వచ్చేసింది. కానీ ఆ మసి నాకు అంటి నా రంగు మారింది. ఏసు మహిమ వలన కుండ వచ్చింది కాబట్టి నా పేరు "ఏసు" అని పెట్టమని ఆ ప్రార్థన వాళ్ళు అడిగారంట. అలా నా పేరు మారింది.



Thursday, February 3, 2011

పుట్టు పూర్వోత్తరాలు.

నా పేరు అశోక చక్రవర్తి. మా అమ్మ నాకు ఎంతో ఇష్టం గా కృష్ణ సినిమా చూసి మరీ పెట్టింది ఈ పేరు. నా ఇప్పటి పేరు ఏసు బాబు.




మాది కృష్ణ జిల్లా లో ఒక చిన్న పల్లెటూరు. మా అమ్మ కి చిన్నతనం లో సొంత బావ తో పెళ్లి జరిగింది.చిన్నప్పుడు అమ్మ నాన్న బాగా గొడవ పడేవాళ్ళట. కారణం మా నాన్న అక్కినేని కి వీరాభిమాని. అమ్మేమో ఎంటీవోడికి అభిమాని.ఇద్దరికీ సినిమాల పిచ్చే. అమ్మాకేమో చిన్నప్పుడే వాళ్ల అమ్మ చనిపోయింది. అమ్మమ్మ పెంపకం. తాతయ్య కూడా లేరు. ఇక ఇద్దరు తొందరగా పనులు ముగించుకుని ఏదో ఒక ఆట సినిమా చూసొచ్ఛేవాళ్ళు. అప్పట్లో నాన్న అమ్మకి సినిమా హాల్లో జీడీలు, పప్పు ఉండలు కొంచెవాడంటా. అలా అలా గంతకు తగ్గ బొంత లా పెళ్లి కుదిర్చారు పెద్దలు.


అమ్మకి పసుపు రిబ్బొన్లు, కుచ్చుల లంగా కొనెట్టు నాన్న కి హీరొ సైకల్ కొనెట్టు ఒప్పందం మీద పెళ్లి కి ఒప్పుకున్నారు ఇద్దరు. అలా అలా వాళ్ల పెళ్లి జరిగింది. మా నాన్నది పెద్ద కుటుంబం. అమ్మ వచ్చాక పెద్ద పని లేదు. చిన్న పిల్ల లే అని కొన్నాళ్ళు కూలీ పనులకు కూడా పంపలేదు ఇంట్లో వాళ్ళు. అలా హాయిగా రిలీస్ అయ్యిన ప్రతి సినిమా చూస్తూ కొన్నాళ్ళు హాయిగా ఉన్నారు. అప్పుడే నేను అమ్మ బొజ్జాలో పడ్డాను.


నేను పుట్టేటప్పటికీ కృష్ణ, కృష్ణం రాజు, సొభన్ బాబు, చిరంజీవి సినిమాల మీద సినిమాలు చేస్తూ మా వాళ్ళని ఇంకా సినిమాల పిచ్చి వాళ్ళని చేశారు. అలా అలా 1980వ సంవత్సరం లో మంచి ఎండ కాలం లో మిట్ట మధ్యానం ఒంటి గంట కి  నేను పుట్టేసానోచ్. నన్ను ఇంట్లో నాయనమ్మ దగ్గర వదిలేసి అమ్మ నాన్న మళ్లీ సినిమాకి వెళ్ళిపోతున్నారంట. ఇక ఇంట్లో పెద్ద వాళ్ళకి విసుగు వచ్చి వేరు కాపురం వెళ్ళిపొమ్మానారంట బాధ్యత తెలుస్తుంది లే అని. అమ్మ నాన్న పని మీద పదేటప్పటికీ ఇక నా కష్టాలు మొదలయ్యాయి.అమ్మ నాలుగు ఇళ్లల్లో అంట్లు టోమేది. నాన్న పొలం పనికి వెళ్ళేవాడు. వచ్చిన డబ్బు వచ్చినట్టు సినిమాలు సోకులు.  చెప్పలేదు కదా మా అమ్మ వాణిశ్రీ వీరాభిమాని. అచ్చు తన లాగే రంగు రిబ్బొన్లు, పొట్టి పమిత వేసుకుని పనికి వెళ్తే అబ్బో వాణిశ్రీ రోయ్ అనుకునేవారంట.


నాన్న అక్కినేని లాగా పక్క క్రాఫు మెడలో రుమాలు వేసుకుని ఉండేవాడు. మరి వీటికి డబ్బు కావాలి గా. నేను అడ్డు అయ్యాను వాటికీ. తీసుకు వచ్చి నాయనమ్మ ఇంట్లో పడేసి మళ్లీ సరదాగా ఉన్నారు. అప్పుడు మా చెల్లి బొజ్జాలో పడింది. అదే టైమ్ లో అమ్మ కి నాన్న కి గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు మమ్మల్ని పంచుకున్నారు. అమ్మేమో చెల్లిని తీసుకుంది. నాన్న నన్ను ఉంచుకున్నాడు. అదే సమయం లో ఎవరో హెరోయినె కి మేకప్ అసిస్టెంట్ కావాలంటే అమ్మ వాళ్ళతో మద్రాసు వెళ్ళింది.అలా నేను నాయనమ్మ దగ్గర 6 ఏళ్లు పెరిగాను.