Friday, February 4, 2011

ఉపాయం లో ఆపాయం.



మా అమ్మ వెళ్లిపోయిన తర్వాత నేను మా నాయనమ్మ తాతయ్య ఇంట్లో పెరిగాను. మా తాత ఆజానుబాహుడు. చాలా బలంగా ఉండేవాడు. మా నాయనమ్మ పొట్టిగా, బక్కగా ఉండేది.


అనగనగా అప్పుడు నాకు 6 ఏళ్ళు. కనీసం ఈ తరం లో అయిన పిల్లల్ని బడికి పంపాలని నిశ్చయం తో మా తాత నాకు పీతల కూర ఎర వేసి మరి బడికి తీసుకుపోయాడు. బళ్ళో మధ్యానం భోజనం , గుడ్డు ఇస్తార్లే అని ఒప్పుకున్నాను. తీరా వెళ్ళాను కదా నాతో అక్షరాల పేరు చెప్పి బొల్లన్ని వంకర్లు తిప్పించాడు మా మాస్టారూ. దానికి తోడు మా తాత ఆదివారం నాడు ఆయనకి మాంఛి మాంసం సమర్పించుకునేవాడు మానవడినీ బాగా పట్టించుకోవాలి అని. ఇక నా పరిస్థితి దారుణం. పక్కనే కూర్చోబెట్టుకుని మరీ దిద్దించేవారు. ఇక ఈ బాధలు తట్టుకోలేక బడికని ఇంట్లో చెప్పి మా పక్కింటి లచ్చిమి తో పాటు బడి పక్కన ఉన్న పశువుల హాస్పిటల్ కి వెళ్ళాము. వాళ్ల నాన్న అక్కడ కొంపౌన్డరు మరి. ఎవరికి కనిపించకుండా దాక్కుని అక్కడికి వచ్చే కుక్కల్ని, కోళ్లని చూస్తూ ఆడుకున్నాం. సరిగ్గా పాసు బెల్లు సమయానికి తాత దగ్గరికి  పరిగెత్తి జేబులో కొన్ని బఠానీలు పోఇంచుకున్నా. బడి వదిలే సమయానికి ఇంటికి పోయి సబ్బరంగా తిని మళ్లీ ఆటలకి వెళ్ళాను.




అలా రెండు రోజులు పోయాక ఆదివారం వచింది. మా మాస్టరు కూడా వచ్చాడు మా తాత దగ్గరికి. అలా నా సంగతి ఇంట్లో తెలిసిపోయింది. అంతా మీ పోలికే అంటూ మా బామ్మ ముసిముసి గా నవ్వింది మా తాత ని చూసి. పోవే ముండా అని కసిరాడు మా తాత. తాత కి దొరకకుండా తిరిగా రెండు రోజులు. నిజం చెప్పొద్దు మా బామ్మ కి కూడా చదువు అంటే నచ్చదు. మా కుల వృత్తి మరిచిపోకుండా గొర్రెలు, ఆవులు కాస్తు వాటి సంతనాన్ని పెంచాలని అంటుండేది.


రెండు రోజులు చూసి మా తాత కి విసుగు వచ్చి ఇక లాభం లేదనుకుని నన్ను గీదలు కాయమని చెప్పాడు. అప్పటికినా బుద్ధి వస్తుందేమో అని ఆశ తో. బుద్ధా ? నాకా ? అని సంతూర్ పిల్లలా అందాం అనుకున్నా కానీ అసలే కాక లో ఉన్నాడు లే అని వదిలేసా. అలా చదివే బాధ నాకు, ప్రతి ఆదివారం ఉచితం గా మాంసం ఇచ్చే బాధ మా తాత కి తీరింది. అలా అలా మా గీదలకె నేను బుల్లి కార్మికుడిని అయ్యాను.




ఇంతకీ మాకు ఎన్ని జీవాలు ఉన్నాయో చెప్పలేదు కదా. ఉన్నది ఒకటే. మా బోడి గీద. దానికి కూడా మా బామ్మ లాగే జుట్టు తక్కువ, హైటు తక్కువ, ఆకలి ఎక్కువ. ఎప్పుడు ఒక చోట మేసేది కాదు. నన్ను కాసేపు కూడా ఎక్కడా ఉండనిచ్చేది కాదు, గోళీలు ఆడానిచ్చేది కాదు. మహా విసుగ్గా ఉండేది నాకు. మా తాత మాత్రం ఏదో చెట్టు నీడన హాయిగా బీడీ కాల్చుకునేవాడు ఆ బోడి దాన్ని నాకు అంటగట్టి.


ఇలా ఉండగా కొన్ని రోజులు మా వూళ్ళో బాగా వర్షాలు పడ్డాయి. దాంతో మా చెరువు పక్క ఉన్న వూబి మళ్లీ నోరు తెరిచిందని చెప్పుకుంటున్నారు. వూబి అంటే ఏంటో నాకు అర్ధం కాలేదు. నా ఫ్రెండ్ తొత్తడమ్ బూశయ్య అని వాడికి మాటలు సరిగ్గా రావు. వాడిని అడిగాను ఏంటిరా అని. వాడు చెప్పాడు, వూబి లో దిగితే ఇక కదలలేము అని. మా బోడి గీద వలన ఏ మధ్య మా లచ్చిమి తో ఆటలు తగ్గాయీ. అప్పుడే మళ్లీ లచ్చిమి నవ్వింది బుర్రలో ఆలోచన మెరిసింది. మర్నాడే మా బోడి గీదని వెంటపెట్టుకుని తిన్నగా వూబి దగ్గరికి వెళ్ళి దాన్ని అక్కడే వదిలేశాను. పెద్ద కొట్లో బఠానీలు తెచ్చుకుందామని వెళ్ళాను కదా మా తాత ఎదురయ్యాడు. నన్ను అక్కడ చూసి పళ్ళు నూరాడు ఈ పని కూడా సరిగ్గా చెయ్యవా అని. అప్పుడే చెప్పాను ఆయనకి నా ఘనకార్యం గురించి. ఆది విని బల్లి మీద పడినట్టు ఉలిక్కిపడ్దాడు. నన్ను ఒంటి చేత్తో లేపి నిజం చెప్పారా తొట్టు కొడకా అని తిట్టాడు. నిజమేనా అన్నాడు! తలూపాను. అంతే! శక్తిమాన్ లా ఒక్క దూకు దూకాడు. మా బామ్మ కి కబురు పెట్టాడు. నేను కూడా అటే పరిగెత్టాను.
వూళ్ళో నలుగురిని పోగేసితీసేకు వెళ్లాడు మా తాత. గంట సేపు కష్టపడి బోడి గేద ని ఇంటికి తీసుకు వచ్చాడు. ఒక్క దెబ్బతో నన్ను మా నాన్న ఇంటికి పంపేసాడు.


ఇక ఆ తర్వాత మళ్లీ నాకు ఏ పని చెప్పలేదు, నా జోలికి రాలేదు.



No comments:

Post a Comment