Friday, February 18, 2011

క్యా స్వాద్ హై


నా రోజులు మెల్లగా అలా అలా నడుస్తూ వున్నాయి. 


                 నేను ఇక్కడ వున్నరోజుల్లో కొన్ని  గమనించా. ఏంటి అంటారా? వినండి.


డబ్బున్న వాళ్ళకి 


1 .  పిల్లలు తక్కువ.
2 . వాళ్ళ పిల్లలకి ఆకలి తక్కువ. 
3 .  చుట్టాలు ఎక్కువ
4 . వాళ్ళు తెచ్చే చాక్లెట్ లు పొడుగెక్కువ.


           సాయి బాబు కి వాళ్ళ మావయ్యలు, బాబాయిలు, మిగలిన బంధు గణం అంతా ఎప్పుడు ఎవోటి తెస్తూ వుండేవారు. మరి వీరు తిన్టేగా! వాళ్ళ అమ్మేమో సాయి ఏమి తినట్లేదని బాధ పడేవారు. అయినా మీరు  చెప్పండి . ఆకలి వేస్తె తినరా ఏంటి ? 


                       ఉదయం లేచినప్పటి నుంచి మొదలయ్యేది యుద్ధం. పాలు తాగించడానికి అబ్బో చాలానే టైం పట్టేది. ఒక్కోసారి విసుగు వచ్చి ఆ గ్లాసు నా చేతికి ఇచ్చి తాగించమని చెప్పి లోనికి వెళ్ళే వారు. ఇక మా ఇద్దరిది సందడే సందడి. ఒక్క దెబ్బ తో పాలు అన్ని నేను గుట్టుక్కున తాగే వాడిని. కాసిని మాత్రం సాయి మూతికి పూసేవాడిని. 


                 ఇది గమనించిన బేబీ అమ్మ గారు వీడు పెడితే పేచి లేకుండా తింటున్నాడని అన్ని నా చేతికి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదేదో ఇద్దరికీ సౌకర్యం గానే వుంది. ఇద్దరం ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాం. ఏదైనా తెచ్చి నా చేతిలో పెట్టగానే సాయి వైపు చూసే వాడిని. వద్దు అన్నాడా సరే సరి. లేదంటే ఓ రెండు సార్లు తింటావా తింటావా అనేవాడిని. వద్దు అనే మాట ఇంకా నోటి నుంచి సాంతం వచ్చే లోపే గుతుక్కుమనిపించేవాడిని. 


                ఈ తతంగం అంతా పాలు, ఉప్మా, పప్పన్నం వరకు బాగానే సాగింది. ఎప్పుడైతే వాళ్ళ మావయ్య కాడ్బరీ చాక్లెట్ తెచ్చాడో అప్పుడు సాయి మారిపోయాడు. ఎంత మారిపోయాడు అంటే... ఆ చాక్లెట్ చేతిలో వున్నప్పుడు నన్ను చూస్తే చాలు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తి అప్పుడు కానీ తినేవాడు కాదు. 


              నేనా చాక్లెట్ రుచి మరిగిన వాడిని. ఆగమంటే ఆగుతానా ...  చూసి చూసి ఒక రోజు సాయి చేతిలో వున్న చాక్లెట్ ని అమాంతం లాగేసుకున్నాను. కుయ్యో మొర్రో మని ఒకటే ఏడుపు. అది చూసిన వాళ్ళ అమ్మ గారు జరిగిన విషయం విని సాయి కి మరొకటి కొనిచ్చారు. నాకు అది కూడా కావాలి మరి. అది కూడా ఎవరు చూడకుండా లాక్కున్నాను. అదేంటి అని అడిగినందుకు సాయి కి ఒక్క మొట్టికాయ వేసాను. హమ్మా.. ఇదేం పని. 


             నచ్చనివన్నీ నాకు , నచ్చినవి మాత్రం తనకా ? అంతే ఒలంపిక్స్ లో మెడaల్ కోసం పరిగెత్తినట్టు ఒక్క అంగ లో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి వచ్చి రాని మాటలతో జరిగినది అంతా వాళ్ళకి చెప్పేసాడు. అప్పటికి కానీ అర్ధం కాలేదు వాళ్ళకి. ఎన్ని పెట్టినా సాయి అంత బక్కగా , నేనేమో బుగ్గలు అవి వచ్చి ఇంత ముద్దుగా ఎందుకున్ననా అని. 


మళ్ళి రాత్రి అంతా అలోచిన్చుకున్నారు. ఎం చెయ్యడమా అని.  ఇక ఇక్కడ వుంటే సాయి కి సరయిన భోజనం అందడం లేదని నన్ను అదే వూళ్ళో వున్న లచ్చమ్మ గారి ఇంటికి పంపించారు. 


               చెప్పలేదు కదూ... సాయి వాళ్ళ నాయనమ్మ గారే ఈ లచ్చమ్మ గారు. 

No comments:

Post a Comment