Sunday, May 29, 2011

వానరమా నీకు వందనం


నా కథల్లోకి వెళ్ళే కొద్దీ బోల్లన్ని పాత్రలు వస్తు వుంటాయి. వీటిలో మనుషులతో పాటు జంతువులూ కూడా వుంటాయి మరి.


                  మరేమో మేము డాబా మీద వుండేవాళ్ళం కదా. నేనేమో కింద నుంచి పైకి మంచి నీళ్ళు మోసేవాడిని. నాకు ఏవైనా ఆహార పదార్ధాలు చూస్తే తినే వరకు  ఒకటే రంది. అప్పటికి తెచ్చే వాటిలో మా లచ్చమ్మ గారికి తెలియకుండా కొన్ని మాయం చేసేవాడిని. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానందోయ్. మా పెద బాబు గారు ఎప్పుడు అంటూ వుండేవారు. ఏనుగుకి వెలక్కాయ అంటే ఎంత ఇష్టమో నాకు అరటి పళ్ళంటే అంతే ఇష్టం అని.       


 ఇది ఇలా వుండగా, ఎక్కడి నుంచో ఒక ముసలి కోతి మా వూరు వచ్చింది. కోతులు అంటే సినిమాల్లో వాణి శ్రీ ఆడిస్తుంటే చూసాను. మళ్లీ ఏదో దేవుడి సినిమాలో హీరోయిన్ కి సహాయం చేస్తుంటే చూసాను కాని నాకు పెద్దగా పరిచయం లేని జంతువు అది. అలాంటిది ఒక సారి మా ఇంట్లో కనిపించింది నాకు. అంతే!!! కేవ్వుమన్నాను నేను. 


           దగ్గర నుంచి చూడడం అదే మొదటి సారి ఏమో, భలే విచిత్రం గా ఉందిలే. అది ముసలి కోతి అంట. ఏదో సర్కస్ వాళ్ళతో పాటు మా పక్కనే వున్నా వుయ్యూరు వచ్చిందంట. పాపం! ఇక్కడే ఉండిపోయింది. 
దాన్ని మొదటి సారి చూసినప్పుడు నాకు దానిలో చాల మంది మనుషుల పోలికలు కనిపించాయి. 


                          అది మా మేడ మెట్లు ఎక్కుతూ నాకు మొదటి సారి కనిపించింది. నిజం చెప్పాలంటే మొదటి సారి దాన్ని చూస్తే ఆ చీకట్లో ఎవరయినా మనిషేమో అనుకున్నాను. మా ఎదురింటి మాస్టారి భార్య లాగే కాస్త వంగి నడుస్తుంది. ఆ రంగేమో మా అంజయ్య గారి లాగే, మిగల పండిన మామిడి పండు రంగు. 


                     అప్పటికే ఆ కోతి పేరు చెప్పి మా లచ్చమ్మ గారు నన్ను ఒకటి రెండు సార్లు దడిపించారు. దానికి తోడు మా లచ్చమ్మ గారి మూడో కోడలు శాంతమ్మ గారి కూతురి చిన్ని , అప్పటికి రెండు ఏళ్ళు ఉంటాయేమో, అన్నం తినడానికి మహా గోల చేసేది. ఎవ్వరు పెట్టినా సరిగ్గా తినేది కాదు. ఇక లాభం లేదు అనుకుని, అన్నం తినకపోతే ఆ కోతి వచ్చి కరుస్తుంది అని చెప్పి భయపెట్టారు. దెబ్బకి జడుసుకుని తినేసింది పిల్ల. అలా ఆ కోతి గురించి ముందే ఏవో వినివుండటం వాళ్ళ, నాకు తెలియకుండానే లోపల భయ పడ్డాను. కాని మీకో విషయం చెప్పనా, నాకు భయం అన్న విషయం మీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు తెలుసా. చెప్తే నా పరువేం కాను ?


        ఇలాంటి  ఒక రోజు ఆ కోతి మా మేడ మాటలు ఎక్కి దర్జాగా పైకి వచ్చింది. అది చూసి పిల్లలం, పెద్దలం అందరం లోపలి పరుగో పరుగు. ఒక సారి ఆ కోతి ఎక్కడి నుంచో ఒక కొబ్బరి చిప్ప తెచ్చుకుంది. అప్పుడే కొట్టిన చిప్ప అనుకుంటా, ఇంకా తెల్లగా వుంది. నాకేమో కొబ్బరి అంటే చచ్చే ఇష్టం ఆయే. ఎలాగా అని అలోచిస్తుంటీ మా చిన్ని గుర్తు వచ్చింది. అంతే ! పిక్క మీద గట్టిగా గిల్లాను. బేర్ బేర్ మని ఒకటే ఏడుపు. కోతి ని చూసి భయపదిందేమో అనుకుని మా చిట్టి బాబు ఒక కర్ర తో దాన్ని తోలాడు. ఆ హడావిడి అది కొబ్బరి చిప్ప వదిలేసి పోయింది. ఆహా! దొరికిందే సందు.... ఎంచక్కా ఆ చిప్ప కడుక్కుని దానిలో బెల్లం వేసుకుని మా ఇంట్లో మావిడి చెట్టు ఎక్కి హాయిగా దాన్ని తినేసా...