Thursday, March 10, 2011

చలనచిత్రం


ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తున్నాను. ఆదివారం నాడు నాలుగు గంటల సినిమా కోసం ఇలా నేను ఎంచక్కా కావలసిన అరెంజిమెంట్లు అవి చేసుకునేవాన్ని. మరేమో ఇక్కడ సీటింగు కి మహా చెడ్డ లాబీయింగులు జరిగేవి. ముందు వరసలో ఎవరు కూర్చోవాలి, తరవాత ఎవరు అని. ఏది ఎం జరిగిన నా స్నేహితులని మాత్రం నాతో పాటు ముందు కూర్చోబెట్టుకునేవాడిని.

            అయ్యో... ఈ సందట్లో పడి అసలు విషయం చెప్పడమే మర్చిపోయా....ఆదివారం నాడు ఎం సినిమా వేస్తారో ముందే చెప్పేవారు. అప్పటి నుంచి ఆ సినిమా గురించి ఎంతో మాట్లాడుకునేవాళ్ళం. ముఖ్యం గా డాన్సులు చేసే సినిమాలంటే ఇంకా ఇష్టం గా వుండేది న బోటి పిల్లకాయలకి.

            ఒక్కటి చెప్తా వినండి. అప్పట్లో సినిమా అంటే అబ్బో అదో గొప్ప. హీరోలు అంటే నలుగురే. సిరంజీవి, బాలయ్య, వెంకటేషు, నాగార్జున. ఇంకా బుడ్డ బుడ్డ హీరోలు ఎంతో మంది వున్నా , మాకు ఆనేవారు కారు. వీళ్ళ సినిమా అయితే ఎంచక్కా ఆట, పాట, ఫైటు అన్ని వుంటాయి. ఇక ఇంకోటి కూడా చెప్పాలి. నేను సినిమాలు చూడ్డం మొదలెట్టినప్పుడు బోల్లంత మంది హీరోయిన్ లు వుండేవారు. కాని న దృష్టి లో మాత్రం రంభ, రమ్యకృష్ణ మాత్రమె. ఎందుకంటే... దానికీ చాలా కారణాలు. అన్ని చెప్పను. చిన్న పిల్లవాన్ని కదా.....

                       ఆ ఇక అసలు ఘట్టానికి వచ్చేసా...మా సినిమా నలుగు నుంచి ఆరున్నర వరకు వచ్చేది. ఆ లోపు ఆరు నూరు అయినా...నూరు ఆరు అయినా...అక్కడ నుంచి ఏ మాత్రం ఇంచి కూడా కదిలేవాళ్ళం కాదు. ఎంచక్కా తెచ్చుకున్నవన్ని తినేసి ఆ సినిమా అంత చూసేసి...ఒక వారానికి సరిపడా కబుర్లన్నీ మూటకట్టుకునేవాన్ని. చెప్పడం మర్చిపోయా...అందులో కొన్ని డైలాగులు కంటస్థం చేసి అవసరం వచ్చినప్పుడు వాడాలి కాదా... ఇక పాటలు, డాన్సుల సంగతి చెప్పఖర్లేదు.

                           వారాంతాల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఏవో ఎంజాయ్ చేస్తున్నారు లీ ఈ మధ్య. కాని నాకు ఈ సూత్రం ఈపాటి నుంచో తెలుసు.. అందుకే శుక్రవారం నుంచి ఆదివారం వరకు భలే సందడి గా వుండేది నాకు. ఇక ఆ సినిమా చూసి పైకి వచ్చి లచ్చమ్మ గారు చెప్పిన చిన్న పనులు చేసేసి...హాయిగా మంచం కింద దూరి నిద్ర పోయేవాడిని. ఎందుకంటారా....ఒక వేళ ఫ్యాన్ ఊడి పడిపోతేను....మంచం మీదే పడుతుంది...నా మీద కాదు...ఏమైనా సరే.... నా తెలివితేటలూ నావి....

Friday, March 4, 2011

ఓహో చిత్రమా....


ఆదివారం మధ్యాహ్నం ముక్క భోజనం చేసి కాసేపు అలా నడుము వాల్చేవాడిని. నాకు ఆహారం బొజ్జలో పడిన వెంటనే అదేంటో కాని నిద్ర తన్నుకు వస్తుంది. నేను అప్పటికి ఇంకా చదువు మొదలెట్టలేదు కాబట్టి సరిపోయింది కాని.. లేదంటే ఎంత కష్టం వచ్చి పడేదో....


                    ఆ.. అలా కాసేపు పడుకుని లేచాక ... గబా గబా కాసిని నీళ్ళు నా సొట్ట తెపాలా తో పైకి తోడుకు వచ్చి...లచ్చమ్మ గారు నాకు తినడానికి పెట్టిన చేగోడిలో ఏవో పట్టుకుని పెద బాబు గారి ఇంటికి పరిగెత్తే వాడిని. అక్కడ కాసేపు  సాయి  బాబు ని ఆడించినట్టు ఆడించి...బాబు తో పాటు నాకు ఇచ్చిన చాక్లేత్తో, బిస్కేత్తో అక్కడే తినేసి...ఎవరు చూడకుండా సాయి బాబు వి నా జేబులో పోసుకుని బయట పడేవాడిని. అప్పటికే నా కోసం మా గ్యాంగు "ఆమ్యంయాలు" పట్టుకుని నా కోసం వెయిటింగు చేసేవాళ్ళు. వాటిని జాగ్రత్త గా ఒక కొబ్బరి తీసేసిన చిప్పలో వేసుకుని మా ఇంటికి పరిగెత్తే వాడిని. 





         హయ్యో!...అసలు విషయం చెప్పనేలేదు కదూ....మా ఈ హడావిడి అంతా ఆదివారం పూట నాలుగింటికి వచ్చే సినిమా కోసం.. 


                               ఇప్పుడంటే పిల్లా జెల్లా అందరికి సినిమా అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది కాని... ఒకప్పుడు ఎంత గౌరవం...ఎంత భక్తి...సినిమా చూసేటప్పుడు సాక్షాత్తు భగవంతుడు వచ్చిన సరే...కాస్సేపు ఆగి రా స్వామి అనేవారు. ఇంకా ఆడవాళ్ళ సంగతి సరే సరి.... మధ్యానం రెండింటికే నిద్రలు మానుకుని ఇంటిడు పని చేసేసుకుని...టీవీ ల ముందు చక్కగా తయారయి కూర్చునేవాళ్ళు. ఇళ్ళు, వాకిళ్ళు కూడా 3 ఇంటికే వూడ్చి ముగ్గులు కూడా పెట్టేసేవారు. మా బోటి పిల్లకాయల స్నానాలు కూడా చేయిన్చేసేవారు పని లో పని. 


                                 ఎన్నడు లేనిది... అత్తా కోడళ్ళు కూడా...ఆ రోజు ఏంటో స్నేహం గా చక చకా పనులు ముగించుకుని దగ్గరలో వున్నా టీవీ ల మీద దాడి చేసేవాళ్ళు. ఇంత గొప్ప చరిత్ర వుండేది 4  గంటల సినిమా కి. ఆ... ఇక్కడ చెప్పాల్సిన విషయం మరోటి కూడా ఉందండోయ్ .....మా అంజయ్య గారి ఇంట్లో పని చేసే బూబమ్మ....మిగిలిన పని వాళ్ళంతా రోజు చెప్పిన టైము కి చచ్చినా రారని మా రాజమ్మ గారు అంటూ వుండేవారు. కాని అదేం మహిమో... టీవీ కి మాత్రం ఒక్క పది నిమిషాలు ముందే వచ్చేవారు. అప్పుడే తెలిసింది నాకు... మనకి కావాలంటే టైము కి వెళ్ళాలి లేదంటే లేదు అని. ఎంతయినా చిన్న పిల్లాడిని... ఏదో అలా అలా నలుగిర్ని చూసి నేర్చుకోరా అనేది మా నాయనమ్మ..


                                        ఇంకా మా సినిమా గురించి బోలెడన్ని ముచట్లు చెప్పాలి...మళ్ళి వచ్చి చెబుతా...